గెరిల్లా ఓపెన్ యాక్సెస్ మానిఫెస్టో

గెరిల్లా ఓపెన్ యాక్సెస్ మానిఫెస్టో

సమాచారం ఒక శక్తి.
కానీ అన్ని శక్తులలానే, ఈ శక్తిని కూడా తమ ఆధీనంలో ఉంచుకోవాలని అనుకునేవాళ్ళు ఉంటారు. ప్రపంచంలోని శాస్త్రీయ, సాంస్కృతిక వారసత్వం – శతాబ్దాలుగా పుస్తకాలలో, పత్రికల్లో ప్రచురించబడిన జ్ఞానం – ఇప్పుడు వేగంగా డిజిటీకరణ చేయబడుతోంది. అయితే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఆ జ్ఞానాన్ని  తమ ఆధీనంలో బంధించేస్తున్నాయి.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన పరిశోధనలను చూపించే పత్రాలను చదవాలనుకుంటున్నారా? అయితే మీరు “రీడ్ ఎల్సివియర్”, “ఐఈఈఈ”, “ఏసీఎమ్” లాంటి ప్రచురణకర్తలకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పోకడను మార్చాలని పోరాడుతున్నవాళ్ళున్నారు.
ఓపెన్ యాక్సెస్ ఉద్యమం శాస్త్రవేత్తలు తమ హక్కులను ప్రచురణకర్తలకు అప్పగించకుండా ఉండాలని, వారి పరిశోధనను ఎవరైనా స్వేచ్ఛగా, ఉచితంగా చదవగలిగేలా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచాలని ధైర్యంగా పోరాడుతోంది. కానీ, ఈ కృషి గరిష్ఠంగా భవిష్యత్తులో ప్రచురితమయ్యే రచనలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటివరకు ప్రచురితమైన సమస్తం పైన చెప్పుకున్న కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉండిపోతుందనే అనాలి.

ఇది మనం చెల్లించే భారీ మూల్యం.
మన సహచరుల పరిశోధనను చదవడానికి అధ్యాపకులు డబ్బు చెల్లించాల్సిందిగా బలవంతపెట్టడమా? లైబ్రరీలలో పుస్తకాలను స్కాన్ చేసి, వాటిని కేవలం గూగుల్‌లో పని చేసేవాళ్ళకే చదవడానికి అనుమతించడమా? అభివృద్ధి చెందిన ధనిక దేశాల్లోని శాస్త్రవేత్తలకు పరిశోధనా పత్రాలను అందిస్తూనే, అభివృద్ధి చెందుతున్న పేద దేశాల పిల్లలకు నిరాకరించడమా? ఇది పూర్తిగా అన్యాయమూ, అంగీకరించలేని పరిస్థితి.

“ఔను, ఇది తప్పు” అని చాలా మంది అనుకుంటారు.
“కానీ మనం ఏం చేయగలం? కాపీరైట్ హక్కులు కంపెనీల వద్ద ఉన్నాయి, అవి జ్ఞానాన్ని అమ్ముకుంటూ భారీగా లాభాలను గడిస్తున్నాయి, ఇది పూర్తిగా చట్టబద్ధమే. మనం వీళ్ళ దౌర్జన్యాన్ని చూస్తూ ఉండటం తప్ప ఆపలేకపోతున్నాం.” కానీ మనం చేయగలిగే పని ఉంది. ఇంకా చెప్పాలంటే, అది ఇప్పటికే జరుగుతోంది: అదే ఈ పోకడ పట్ల మన ప్రతిఘటన.

మీకు ఈ వనరులు అందుబాటులో  ఉన్నాయా?
మీరు విద్యార్థులా? లైబ్రేరియన్లా? శాస్త్రవేత్తలా? అయితే మీకు ఒక ప్రత్యేక అధికారం ఉంది. ప్రపంచ జ్ఞానం మొత్తం కట్టుదిట్టమైన గోడల వెనుక నిర్బంధితమై ఉండగా, మీరు ఈ జ్ఞాన సర్వస్వానికి చేరువలో ఉన్నారు.

కానీ మీరు ఈ అధికారం వలన పొందుతున్న సమాచారాన్ని మీ దగ్గరే ఉంచుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి, మానవతా దృష్టిలో చూస్తే, మీకే పరిమితం చేసుకోవడం తగదు.
ఈ జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకోవాలనే నైతిక బాధ్యత మీకు ఉంది. మీరు ఇప్పటికే సహచరులతో పాస్‌వర్డ్లు పంచుకోవడం ద్వారా, మీకు మాత్రమే అందుబాటులో ఉండే సమాచారాన్ని స్నేహితుల కోసం డౌన్‌లోడ్ చేసి పెట్టడం ద్వారా జ్ఞానాన్ని పంచుకుంటున్నారు.

అంతేకాదు, డబ్బు చెల్లించలేక సమాచారాన్ని పొందలేనివారు సైతం  చేతులు ముడుచుకుని ఊరుకోలేదు.
వీరు అన్ని చట్టాధీన, చట్టవ్యతిరేక మార్గాల ద్వారా  ఆయా సమాచార వనరులను చిన్ని చిన్ని రంధ్రాల ద్వారా  ప్రవేశించి, సమాచారానికి అడ్డుగా వేసిన కంచెలను దాటి, ప్రచురణకర్తల చేత బంధించబడిన సమాచారాన్ని విముక్తి చేస్తూ, మనందరితో  పంచుకుంటున్నారు.

కానీ ఇవన్నీ చీకటిలో, అండర్ గ్రౌండ్ వ్యవస్థలా, గోప్యంగా, దాపరికంలో జరుగుతున్నాయి.
ఇది దొంగతనం, పైరసీ అని పిలవబడుతోంది – ఒక నౌకను దోపిడీ చేసే పైరేటును ఒక పక్క, తన దగ్గర ఉన్న జ్ఞానాన్నే పంచుకునే వారిని  మరో పక్క పెట్టి వీళ్ళు ఒకటిగా పోల్చి చూపిస్తున్నారు. మనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని పంచుకోవడం అనైతికం కానే కాదు – అది ఒక నైతిక బాధ్యత. స్వార్థంతో కళ్ళు మూసుకున్నవాళ్ళే మిత్రుడు మన దగ్గర ఉన్న సమాచారపు కాపీని తీసుకోవడాన్ని నిరాకరిస్తారు.

పెద్ద కార్పొరేషన్ల కళ్ళు సహజంగానే స్వార్థంతో మూసుకుపోయాయి.
వాటి పని తీరును నియంత్రించే చట్టాలు అదే కోరుకుంటాయి – వాటి షేర్ హోల్డర్లు, లాభాలు తక్కువ వస్తే తిరగబడతారు. వాళ్ళ చెప్పుచేతల్లో ఉన్న రాజకీయ నేతలు సైతం అండగా ఉంటారు, నకళ్ళు తీయనివ్వాలా లేదా అనేదానికి పూర్తిగా ఆయా కంపెనీలకే అధికారం కల్పించే చట్టాలను ఆమోదిస్తారు.

అన్యాయపు చట్టాలను అనుసరించడంలో ఏమాత్రం న్యాయం లేదు.
వెలుగులోకి వచ్చి, అణచివేతకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాల్సిన సమయం ఇది. పౌర అసమ్మతి కి సంబంధించిన  గొప్ప సంప్రదాయాన్ని అనుసరించి, ప్రజల సొత్తైన  సమాచార, జ్ఞాన హక్కులను ప్రైవేట్ సంస్థలు దోచుకోవటాన్ని అంగీకరించబోమని  ప్రకటించాల్సిన సమయం ఇది.

సమాచారం ఎక్కడ ఉన్నా, దాన్ని తీసుకుని, కాపీలు సృష్టించి, ప్రపంచంతో పంచుకోవాలి.
కాపీరైట్ గడువు ముగిసిన సమాచారాన్ని స్వేచ్ఛాయుత వనరులుగా మార్చాలి. రహస్య డేటాబేసులను కొనుగోలు చేసి వాటిని వెబ్‌లో బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉంచాలి. శాస్త్రీయ పరిశోధనా పత్రాలను డౌన్‌లోడ్ చేసి, ఫైల్ షేరింగ్ నెట్‌వర్క్‌లలో అప్‌లోడ్ చేయాలి. 

గెరిల్లా ఓపెన్ యాక్సెస్ కోసం పోరాడాలి.

ప్రపంచ వ్యాప్తంగా, మనమందరం కలిసి ఉద్యమించినట్లయితే…
జ్ఞానం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు బలమైన సందేశాన్ని పంపడం మాత్రమే కాదు – ఆ ప్రజా వ్యతిరేక పోకడనే గతానికి అంకితం చేసేయగలం.

మరి మీరు మాతో చేరతారా?

రచయిత: ఆరన్ స్వార్ట్జ్, జూలై 2008, ఎరెమో, ఇటలీ

స్వేచ్ఛానువాదం: రహ్మానుద్దీన్, ఫిబ్రవరి 2025, విజయవాడ, భారతదేశం

ఈ అనువాదం క్రియేటివ్ కామన్స్ 0, ప్రజా పరిధిలో (పబ్లిక్ డొమెయిన్‌లో) విడుదల చేయబడింది. ఇది సార్వజనీనం. 

English: https://archive.org/details/GuerillaOpenAccessManifesto