2025లో విజయవాడ పుస్తక మహోత్సవం సందర్భంగా రచయితలు, ప్రచురణకర్తలకు స్వేచ్ఛా లైసెన్స్‌ల మీద అవగాహన ఇవ్వాలని ఈ పిలుపునిచ్చాము. ఇంగ్లీష్ వెర్షన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాల్సిన ఒక ముఖ్యమైన విషయం. డిజిటల్ యుగంలో అంతర్జాలం ద్వారా సమాచార లభ్యత ఎంతో మెరుగ్గా జరుగుతుంది. అందరికీ అందుబాటులో ఉన్న ఈ అంతర్జాలంలో మరింత విలువైన సమాచారాన్ని, విజ్ఞానాన్ని చేర్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా మీ రచనలను స్వేచ్ఛా లైసెన్సులతో విడుదల చేయమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.
స్వేచ్ఛా లైసెన్స్ అంటే ఏమిటి?
“స్వేచ్ఛా లైసెన్స్” అనేది రచయితలు ఇతరులకు వారి రచనలను ఉపయోగించడానికి, సవరించడానికి ఇంకా పంపిణీ చేయడానికి ఇష్టపూర్వకంగా అనుమతిని మంజూరు చేసే ఒక లైసెన్సు. ఇది సాధారణ కాపీహక్కులకు భిన్నంగా, రచనలను స్వేచ్ఛగా ఉపయోగించుకునే హక్కును అందరికీ ఇచ్చే లైసెన్సు.
దీని వలన మీకు ఎలా ప్రయోజనం చేకూరుతుంది?
- మీ పుస్తకాలు యూనికోడ్లో అందుబాటులో ఉండి, పదాలను వెతుక్కునే వెసులుబాటు ఉంటుంది.
- అంతర్జాలంలో, డిజిటల్ లైబ్రరీలలో మీ రచనలు సులభంగా అందుబాటులో ఉండడం వలన మీకు మరింత ప్రజాదారణ, విక్రయాలు పెరుగుతాయి.
- ఎవరైనా మీ రచనలను ఉపయోగిస్తే మీ వివరాలను జోడించడం (ఎట్రిబ్యూషన్).
- లైసెన్స్ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా దుర్వినియోగం చేస్తే రచయితకు ఎదుర్కొనే హక్కు ఉంటుంది.
- ముద్రణలో లేని చాలా పుస్తకాలను డిజిటల్ రూపంలో తక్కువ ఖర్చుతో ప్రాచుర్యంలోకి రావడం.
- ప్రచురితమైన పుస్తకాలు/కథనాల నుండి రిఫరెన్సింగ్కు AI చాట్ బాట్ లు మీ రచనలను వాడడం.
- మీ పుస్తకాలనే కాకుండా, ఇతరులు స్వేచ్ఛా లైసెన్సులతో ప్రచురించిన పుస్తకాలను కూడా ముద్రించి ప్రచురించవచ్చు.
ఇది సమాజానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?
- వికీపీడియా/ఇంటర్నెట్ ఆర్కైవ్/గూగుల్ బుక్స్ ద్వారా మీ పబ్లికేషన్లు మరింత చేరువగా ఉండడం.
- చారిత్రక రచనలకు మరింత ఆదరణ, సమాచార వ్యాప్తి, పరిశోధకులు, విద్యార్థులు, పాత్రికేయులు, పాఠకులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
- ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా తెలుగు పుస్తకాలు, సాహిత్యం గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయగల వ్యవస్థీకృత సమాచార సేకరణ. ఉదా: నేను 1960-70 మధ్య కాలంలో ఒక నిర్దిష్ట రచయిత లేదా ప్రచురణకర్త యొక్క పుస్తకాలను “ఫిక్షన్” జానర్లో “రాజేష్” అనే పాత్రతో కనీసం 100 పేజీలు ఉన్న పుస్తకాల జాబితా చేయగలను. విద్యార్థులు/జర్నలిస్టులు/పరిశోధకులు మొదలైనవారు మీ పుస్తకాల నుండి ఎంతో ప్రయోజనం పొందుతారు మరియు వారి రచనలలో వాటిని సూచిస్తారు.
- వికీపీడియా అతిపెద్ద స్వేచ్ఛా విజ్ణాన సర్వస్వం. ఏదైనా గూగుల్ సెర్చ్ చేస్తే మొదట వికీపీడియా, వికీసోర్స్ నుండి సమాచారాన్ని అందిస్తుంది. ఇది పని చేయడానికి, రచనలు వికీమీడియా ప్రాజెక్ట్‌లకు జోడించబడేలా ఓపెన్ లైసెన్స్‌లలో ఉండాలి.
ఎలా ప్రారంభించాలి? ఒక డిక్లరేషన్ లేఖ, మీరు విడుదల చేయాలనుకుంటున్న ప్రచురణల జాబితా మీరు తయారు చేస్తే చాలు.
తరచుగా అడిగే ప్రశ్నలు:
- మా గురించి: స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, ఇది ప్రతి ఒక్కరికీ జ్ఞానం అందుబాటులో ఉండాలి అనే అలోచనతో పని చేస్తుంది. మేము స్వేచ్ఛా విజ్ఞాన వనరులను, ఓపెన్ సోర్స్ టెక్నాలజీలను ప్రోత్సహిస్తాము. డిజిటల్ లైబ్రరీలు, కంప్యూటర్ విద్య, కాలేజీలలో మేము ఎక్కువగా పని చేస్తాము.
- రీ-లైసెన్సింగ్ తర్వాత మేము విక్రయించవచ్చా? మీరు అన్ని పుస్తకాలు విక్రయించే విధంగానే ఆన్లైన్, లేదా మీ స్టోర్లలో ఈ ఓపెన్ లైసెన్స్ కంటెంట్‌ను ప్రచురించవచ్చు, విక్రయించవచ్చు, కాపీ చేయవచ్చు లేదా ఏదైనా వెబ్సైట్లో అందుబాటులో ఉంచవచ్చు.
- దీనికి ఏంటి ప్రక్రియ? ప్రచురణల జాబితాతో కూడిన డిక్లరేషన్ లేఖ తయారుచేయడం మాత్రమే. దీనికి చాలా తక్కువ సమయం పడుతుంది.
- ఎలాంటి లైసెన్సులు ఉన్నాయి? క్రియేటివ్ కామన్స్, పబ్లిక్ డొమెయిన్ లాంటి లైసెన్సులతో విడుదల చేయవచ్చు.
మీరు పుస్తకాలను ఈ విధంగా ప్రచురించాలి అనుకుంటే, లేదా మరింత సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి.
ఈమెయిల్: commons@swechaap.org